హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటి (మంగళవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే గ్రామసభల్లో లబ్దిదారులు ఆందోళనకు దిగారంటూ వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) స్పందించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని.. కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారన్నారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. అంటే 96 శాతం గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుందన్నారు.
ఉద్దేశపూర్వకంగానే గొడవలు…
పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని.. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని.. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలని టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఓట్లప్పుడే పథకాలు అరకొరగా ఇచ్చేవారన్నారు. కానీ ప్రజా అవసరాలు, ఆర్థిక వనరులను బట్టి పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని.. అందుకే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ గొడవలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదని.. ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉందన్నారు. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఆందోళన వద్దు..
గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ చేత కానితనం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. పది సంవత్సరాల్లో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు అని ప్రశ్నించారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారని.. కానీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదన్నారు. బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకే సారి అమాంతంపైకి రాలేదన్నారు. టీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి , ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి.. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందని చెప్పుకొచ్చారు. మంచిని తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం టీఆర్ఎస్కు అలవాటు అంటూ మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది నిరంతర ప్రక్రియ
సీఎం వచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్ ఆమోదం అవుతుందని.. రిపోర్ట్ దాదాపుగా పూర్తి అయిందని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని తెలిపారు. స్కీమ్‌లకు అప్లికేషన్లు నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. పాలన చేత గాదు అని తమ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పాలించ లేదా అని ప్రశ్నించారు. పదవులు మీద ఉన్న ఆకాంక్ష.. ప్రజల మీద బీఆర్ఎస్కు లేదన్నారు. కేటీఆర్ అందరికి రైతు బంధు ఇవ్వాలని అంటున్నారని.. 500 ఎకరాలు ఉన్నోళ్లకు రైతుబంధు ఇవొద్దని తమ ప్రభుత్వం అనుకుంటుందన్నారు. గ్రామ సభలో ప్రదర్శించే జాబితా మీద ప్రజల అభిప్రాయాలు తీసుకుని లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. నిజమైన పేద వారికి పథకాలు అందాలని.. అర్హులలో పార్టీలు చూడటం లేదన్నారు. చాలా కాలం నుంచి రేషన్ కార్డులు లేవని.. అందుకే ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తోందని అన్నారు. అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని.. అర్హులందరికీ అందే వరకు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు.
