హైదరాబాద్లో ఇళ్లకు గిరాకీ పుంజుకుంటోంది. 2023 సంవత్సరంలో రిజిస్టర్ అయిన ఇళ్ల సంఖ్య 71,912 ఉండగా.. 2024లో వీటి సంఖ్య 7 శాతం పెరిగి 76,613 ఇళ్లకు చేరుకుంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. 2023లో రిజిస్టర్ అయిన ఇళ్ల మొత్తం విలువ రూ.38,395 కోట్లు ఉండగా.. 2024లో రిజిస్టర్ అయిన ఇళ్ల విలువ 23 శాతం మేర పెరిగి రూ.47,173 కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలోని మొత్తం రిజిస్ర్టేషన్లలో దాదాపు 90 శాతం వాటా నివాస గృహాల విభాగానిదే. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు హైదరాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో చెప్పుకోదగిన మార్పు కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ తెలిపారు.2023లో రిజిస్ర్టేషన్లలో రూ.50 లక్షలకన్నా తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా 68 శాతం ఉండగా..2024లో 60 శాతానికి తగ్గిందని తెలిపారు. అయితే రూ.50 లక్షలకన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రాపర్టీల వాటా 32 శాతం నుంచి 40 శాతానికి పెరిగిందన్నారు.
