హైదరాబాద్ సిటీ: అనుమతిలేని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ఫిజియోథెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రులను నడిపించే వ్యక్తులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్(Clinic)లను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ కదిరివన్, అడిషనల్ డీసీపీ మనోహర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకట్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీరంగ్ అబ్కారీ తదితరులు పాల్గొన్నారు.
