కౌలాలంపూర్: అండర్-19 టీ20 వరల్డ్‌క్‌పలో భారత అమ్మాయిలు హ్యాట్రిక్ విజయాన్నందుకున్నారు. అలాగే గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా ఆరు పాయింట్లతో సూపర్ సిక్స్ బరిలో నిలిచారు. 2,3 స్థానాల్లో నిలిచిన శ్రీలంక, వెస్టిండీస్ జట్లు కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాయి. గురువారం శ్రీలంకతో జరిగిన ఈ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఇద్దరు తెలుగు క్రికెటర్లు రాణించడం విశేషం. బ్యాటింగ్‌లో గొంగడి త్రిష (44 బంతుల్లో 49) అండగా నిలవగా, బౌలింగ్‌లో షబ్నం (2/9) ప్రత్యర్థిని కట్టడి చేసింది. దీంతో భారత్ 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. లంక బౌలర్ల ధాటికి ఓవైపు వేగంగా వికెట్లు పడుతున్నా త్రిష నిలకడగా రాణించడంతో జట్టు స్కోరు వంద దాటగలిగింది.
ప్రముది, లిమన్స, అసెనిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 58 రన్స్‌కే పరిమితమైంది. వీరి ఇన్నింగ్స్‌లో రష్మిక (15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించింది. షబ్నంతోపాటు జోషిత, పరుణికలకు రెండేసి వికెట్లు లభించగా, స్పిన్నర్ వైష్ణవి (4-1-3-1) పొదుపుగా బౌలింగ్ చేసింది.
