గత ఏడాది (2024) దేశంలోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్ఫ)కు బాగానే కలిసొచ్చింది. ఈ పథకాల ద్వారా ఎంఎఫ్ పరిశ్రమ గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.3.94 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది….
న్యూఢిల్లీ: గత ఏడాది (2024) దేశంలోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్ఫ)కు బాగానే కలిసొచ్చింది. ఈ పథకాల ద్వారా ఎంఎఫ్ పరిశ్రమ గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.3.94 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. అంతకు ముందు సంవత్సరం సమీకరించిన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.2.33 లక్షల కోట్లు ఎక్కువ. దీంతో 2024 డిసెంబరు నాటికి ఈక్విటీ పథకాల ఎంఎ్ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.30.57 లక్షల కోట్లకు చేరింది. 2023 డిసెంబరుతో పోలిస్తే ఇది రూ.8.77 లక్షల కోట్లు ఎక్కువ. గత ఏడాది ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.3.94 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.2.5 లక్షల కోట్లు క్రమానుగత పెట్టుబడుల (సిప్) ద్వారా సమకూరాయి.
ఈ ఏడాది కష్టమే: అయితే ప్రస్తుత సంవత్సరం (2025) ఈ పెట్టుబడులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. మార్కెట్ ఆటుపోట్ల కారణంగా గత ఏడాది డిసెంబరు నుంచే ఈ పథకాల్లోకి పెట్టుబడుల వేగం తగ్గినట్టు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈఓ సంతోష్ జోసెఫ్ చెప్పారు. సాధారణంగా ఈ పథకాల్లోకి పెట్టుబడులు మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. దీంతో ఈ సంవత్సరం కొత్త ఈక్విటీ పథకాలు కూడా మార్కెట్కు పెద్దగా రాకపోవచ్చని భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక మదుపరులకు మాత్రం ప్రస్తుత మార్కెట్ అత్యంత అనువైందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
